Wednesday, June 9, 2021

                                             కష్టాల బరిలో గొర్రెల కాపరి


        ఎండకు ఎండి, వానకు తడుస్తూ, చలి గాలులను సైతం లెక్కచేయ కుండా సుమారు 3కోట్ల గొర్రెలు, మేకల పెంపకంద్వారా దేశంలో రాష్ట్రాన్ని రెండవ స్థానంలో నిలిపి వారి కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు సమాజానికి బలవర్ధకమైన మాంసాన్ని, శ్రేష్ఠమైన పాలను, వ్యవసాయానికి రసాయనిక ఎరువులకు బదులు సహజ ఎరువులను, ఉన్నిని ఎగుమతి చేయడంలో ఉపయోగపడుతున్నారు.

మన దేశంలో వ్యవసాయం తరువాత వ్యవసాయానికి అనుబంధంగా వున్న వృత్తి గొర్రెలు, మేకల పెంపకం. ఈ వృత్తి మన రాష్ట్రంలో అతిప్రధాన మైనది. గొర్రెలు, మేకల పెంపకందారుల్లో 90శాతం పైగా గొల్ల, కురుమ (యాదవ) కులాలకు చెందిన వారున్నారు. అక్కడక్కడా ఇతరులు ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 6లక్షల కుటుంబాలు ఈ వృత్తిపై ఆదారపడి జీవిస్తున్నాయి. వీరు ఎండకు ఎండి, వానకు తడుస్తూ, చలి గాలులను సైతం లెక్కచేయ కుండా సుమారు 3కోట్ల గొర్రెలు, మేకల పెంపకంద్వారా దేశంలో రాష్ట్రాన్ని రెండవ స్థానంలో నిలిపి వారి కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు సమాజానికి బలవర్ధకమైన మాంసాన్ని, శ్రేష్ఠమైన పాలను, వ్యవసాయానికి రసాయనిక ఎరువులకు బదులు సహజ ఎరువులను, ఉన్నిని ఎగుమతి చేయడంలో ఉపయోగపడుతున్నారు.
ప్రపంచీకరణలో భాగంగా ఇతర వృత్తుల మాదిరిగా గొర్రెల పెంపకం వృత్తిని కూడా నాశనం చేయాలని చూస్తుంది. ప్రభుత్వ భూమిని బహుళజాతి కంపెనీలకు కట్టపెట్టాలనే కుట్రలో భాగంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు)కు వేలాది ఎకరాల భూమిని దారాదత్తం చేశారు. ఓపెన్‌ కాస్టుల పేరుతో మంచిర్యాల నుండి పాల్వంచ వరకు సింగరేణి ప్రాంతమంతా భూములు గుంజుకొని భూములు తవ్వాలని చూస్తున్నారు. ఓపెన్‌ కాస్టులు చేసిన ప్రాంతంలో మేత కాదు కదా కనీసం గొర్రెలు తిరగటానికి స్థలం కూడా ఉండదు. గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాల భూమిని లాక్కొని నిర్వాసితులను చేయగా కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ పేరుతో మరిన్ని భూములు, వాటర్‌ గ్రిడ్‌ పేరుతో కొన్ని భూములు, కొత్త పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటు చేస్తామని, రోడ్ల విస్తరణ-నూతన రోడ్ల నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. వ్యవసా యం చిన్న కమతాలుగా ఏర్పడటం, బంజరు భూములు, కాలువ గట్లు, చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొద్ది పాటి మేత వనరులు వున్న గుట్టలు, కొండలను పెద్ద పెద్ద గ్రానైట్‌ కంపెనీలకు, క్వారీ యజమానులకు, క్రషర్‌ మిల్లులకు ప్రభుత్వమే లీజుల పేరుతో వారికి కట్టబెడు తున్నది. నల్గొండ జిల్లాలోని భువనగిరి నుండి చౌటుప్పల్‌ వరకు ''దిల్‌'' అనే ఔషధ సంస్థకు ప్రభుత్వ భూములను కట్టబెట్టాలని చూసారు. ఆ ప్రాంతానికి కొద్దిరోజులు గొర్రెలను రానివ్వలేదు.1976లో జాతీయ వ్యవసాయ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ప్రతి గ్రామంలో సాగుచేసే భూముల్లో 8నుండి 10శాతం వరకు మేతకోసం కేటాయించాలని సూచించింది. కాని ప్రస్తుతం 2నుండి 3శాతం వరకు దాటడంలేదు. దీనివలన గొర్రెలు, మేకలకే కాకుండా మిగతా పశువులకు కూడా మేత దొరకడం లేదు. ఫారెస్టు భూములకు రాకుండా ఫారెస్టు అధికారులు అనేక ఆంక్షలు పెడుతున్నారు. అదే విధంగా కరువు ఏర్పడ్డప్పుడు మేత దొరుకక సుదీర్ఘ కాలంపాటు సుదూర ప్రాంతాలకు గొర్లకాపర్లు వలస వెళ్లాల్సి వస్తున్నది. జీవాల మేతకోసం భూములు కేటాయించాలని ఇచ్చిన 559 జి.వో.ను ప్రభుత్వం అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నది. అలాగే తుమ్మచెట్లపై హక్కులు కల్పిస్తూ ఇచ్చిన 1016 జి.వో.ను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతోపాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో చెరువుల పూడికతీతలో భాగంగా తుమ్మచెట్లు వేలంపాటలు వేసి అమ్ముకొని సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు డబ్బులు గడించారు. ఈ పరిణామాలన్నీ గొర్రెల పెంపకందారుల వృత్తిదారులకు నష్టం చేస్తున్నాయి. తద్వారా ఈ వృత్తినుండి పేదలైన గొర్రెల కాపరులను దూరంచేయాలని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు చూస్తున్నారు.
        ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా బహుళజాతి సంస్థలకు లాభం చేసేవిధంగా పశువుల మందుల కంపెనీలపై గతంలో ఉన్న ధరల నియంత్రణ చట్టాన్ని (డి.సి.పి.) ఎత్తివేసి గొర్రెలకు ఉపయోగించే మందుల ధరలను తమ ఇష్టారాజ్యంగా పెంచుకొనే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు ప్రభుత్వ లాబ్‌లను తగ్గిస్తున్నారు. పరిశోధనలు తగ్గించి ప్రైవేట్‌ సంస్థలు ఉత్పత్తి చేసే మందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రతీ గొర్రెల పెంపకందారుడు 50నుండి 100గొర్రెలకు ఏటా 8నుండి 10వేల వరకు వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం నిరక్షరాస్యులు ఉండటం వలన వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న మెడికల్‌ కంపెనీలు నాసిరకం మందులు ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నాయి. రోజురోజుకు కొత్తకొత్త కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చాలా కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. వీటిని నివారించాల్సిన ప్రభుత్వాలు మెడికల్‌ కంపెనీల కొమ్ముకాస్తున్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్‌ మార్కెట్‌కు ద్వారాలు తెరిచి నాణ్యతకు తిలోదకాలిస్తున్నాయి.
సరళీకరణ విధానాల్లో భాగంగా చేపట్టిన బ్యాంకుల సంస్కరణలు గొర్లకాపర్లకు తీరని నష్టం చేస్తున్నాయి. గొర్రెలు పెద్దపెద్ద ఫారాల్లో (షెడ్లలో) పెంచితే అధిక లాభాలు వస్తాయని అలా పెంచితేనే ఋణాలు ఇస్తామని ప్రభుత్వం నుండి రాయితీలు ఇస్తామని, సబ్సిడీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం చేసి ఈ వృత్తిలోకి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. కాని దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ గొర్రెల పెంపకాన్ని ఫారాలలో షెడ్డులలో కేవలం దాణా వేసి బయట తిరుగకుండా పెంచితే లాభాలు వచ్చిన ఆధారాలేమీ లేవు. ప్రభుత్వం ఇస్తున్న భూమి తీసుకొని ప్రభుత్వ విద్యుత్‌ సౌకర్యాన్ని వినియోగించుకొని బ్యాంకుల ద్వారా ఋణాలు పొంది, ప్రభుత్వ సబ్సిడీలు గడించి అడ్రస్‌ లేకుండా పోయిన సంస్థలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు సమారు 310 సంస్థలు లేక వ్యక్తులు గొర్రెల ఫారాలు పెడుతామని ముందుకొచ్చి ప్రారంభించారు. ఇందులో ఎక్కువ శాతం నాబార్డు ద్వారా లబ్ది పొందారు. వీరిలో అత్యధిక శాతం గతంలో ఆ వృత్తిపై అనుభవం లేనివారు, వృత్తికి ఎలాంటి సంబంధం లేని వారున్నారు. వారు ఫారాలు పెట్టిన ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రాగానే చాలా వరకు మూసేసి ఆ భూమి అమ్ముకొని పోయారు. కాని తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ సమాజ అభివృద్ధికి ఉపయోగ పడుతున్న గొర్లకాపర్లకు లక్ష రూపాయల ఋణం అడిగితే భూమి ఉందా? ఇల్లు ఉందా? ఏం తాకుట్టు పెడుతావంటూ ప్రశ్నిస్తూ కనీసం బ్యాంకు మెట్లు కూడా తొక్కనివ్వడంలేదు.

        ఈ దేశంలో ఉన్న స్వదేశీ గొర్లకాపర్లను, ఇతర మాంస ఉత్పత్తి దారులను పట్టించుకోకుండా మన ఎగుమతులు తగ్గిస్తున్నారు. ఆవుతోలు ఎగుమతులు చేస్తున్నారనే తప్పుడు వాదనతో గొర్రెలు మేకల తోళ్ల ఎగుమతులు కూడా నిషేధాలు పెట్టాలని చూస్తున్నారు. దీనితో దేశంలో దేశీయ తోళ్ల పరిశ్రమ నష్టాల్లోకి పోయింది. మాంసం ఉత్పత్తిలో వీరిని ప్రోత్సహించకుండా ఇతర దేశాలనుండి మాంసాన్ని దిగుమతి చేసుకునేందుకు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో వాళ్లు తినడానికి ఇష్టపడని కోడి కాళ్లను (లెగ్‌ పీస్‌లు) గొర్రెల మేకల మాంసాన్ని మరియు ఇతర మాంసాన్ని దిగుమతి చేయడం ద్వారా విదేశీ బహుళజాతి సంస్థలకు లాభాలు తెచ్చే పని చేస్తున్నారు. మరో వైపు ఈ వృత్తిపై (మాంసంపై) ప్రభుత్వం కొన్ని మత శక్తులు అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు. మాంసం తింటే ఆరోగ్యానికి హానికరం అంటూ పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ''యోగా డే'' నిర్వహించి శాఖాహారం తినాలని ప్రచారం చేశారు. కొంత మంది యోగా గురువులు, కొన్ని మత సంస్థలు మాంసం తినకూడదని మేక కూడా దేవుడు అంటూ మేక మాంసం కూడా తినకూడదంటూ ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రపంచంలో మనకంటే ఎక్కువ మాంసాహా రాన్ని తింటున్న అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల్లో ఆ దేశ మనిషి సగటు జీవిత కాలం మన దేశ మానవ సగటు జీవిత కాలానికంటే ఎక్కువగానే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

        మరో వైపు సంక్షేమ పథకాల కోత విధిస్తున్నారు. వీరి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించక పోగా ఉన్న పథకాలు కూడా తీసేస్తున్నారు. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ''భేడ్‌ పాలక్‌ భీమా యోజన'', ''సన్నజీవాల అభివృద్థి పథకము''(నాబార్డు సబ్సిడీ) పథకాలను ఎత్తేసారు. ఈ విధంగా గొర్లకాపర్ల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసి వృత్తినుండి దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు.
- ఉడుత రవిందర్‌
9490098487                        (04 Jan 2016 నవతెలంగాణ దినపత్రికలో ప్రచురించారు)  




"పాడి రైతుల గోస పట్టదా!"

                    "పాడి రైతుల గోస పట్టదా!"

పాలు, పాల ఉత్పత్తులతో సమాజానికి నిత్యం బలవర్థకమైన ఆహారాన్నందిస్తూ కోట్లాది కుటుంబాలకు ఉపాధినిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్న పాడి పరిశ్రమ నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. తెలంగాణలో పాడి రైతులు అనేక కష్టాలతో బతుకులీడుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఒక్కో కుటుంబానికి రోజుకు లీటరు చొప్పున సుమారు కోటి లీటర్ల పాలు అవసరం. కానీ 54.2 వేల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అవసరమైన మిగతా పాలు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ఈ లోటును తీర్చడానికి 1677.11 కోట్లు ఖర్చుతో 50శాతం సబ్సిడీపై ఇంటికో గేదెను కొనుగోలు చేసి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గేదెలు ఇవ్వడమే కాకుండా పాలు నిలువ చేయడానికి, గడ్డి కోయడానికి మిషన్లను కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డెయిరీతోపాటు మదర్‌, కరీంనగర్‌, ముల్కనూర్‌ డెయిరీల్లో పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకాన్ని ఇస్తామన్నారు. కానీ 2016 నుంచి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేవలం 8 నెలలకు మాత్రమే ప్రభుత్వం నగదు వేసింది. రైతులకు దాణా, మినరల్‌ విక్షర్‌, కాల్షియం, ఎదకు రావడానికి ఇంజక్షన్‌లు ఇవ్వడం కోసమని ప్రతి లీటరుకు 20 పైసలు కోత విధిస్తున్నారు. ఈ మొత్తం డబ్బులు జిల్లా యూనియన్‌ల అక్కౌంట్‌లలో నిల్వ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం పంపిణీ చేయడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ ఎక్కువగా జరుగుతోంది. ఈ డెయిరీ సహకార సంస్థ అయినప్పటికీ లాభాల వాటాలను మాత్రం రైతులకు పంచకుండా నిర్లక్ష్యం చేస్తోంది. 


తెలంగాణలో జిల్లాలవారీగా ఉన్న విజయ డెయిరీతోపాటు కరీంనగర్‌, మదర్‌, ముల్కనూర్‌ డెయిరీల ద్వారా పాల సేకరణ చేస్తున్నారు. వేసవిలో కొరత ఉన్నప్పుడు పోటీపడి మరీ పాలను కొనుగోలు చేసే డెయిరీలు వానాకాలంలో పాల ఉత్పత్తి, లభ్యత పెరగడంతో పాల సేకరణ తీరు మారుతుంది. దాంతో రైతులకిచ్చే ప్రోత్సాహకాలు తగ్గించేస్తున్నాయి. పాడి రైతులు అనేక కష్టాలకోర్చి పాల ఉత్పత్తి చేసినప్పటికీ ఆ పాలను వినియోగదారునికి నేరుగా అమ్ముకునేది అతి తక్కువ. ప్రాసెసింగ్‌ చేసిన పాలను, రకరకాల పాల పదార్థాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేది మధ్య దళారీలు మాత్రమే. ఈ దళారీ పాత్రను డెయిరీ ఏజెన్సీలు, కొంతమంది పాల వ్యాపారస్తులు, ప్రైవేట్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీలు పోషిస్తున్నాయి. వాటికి వివిధ ఉత్పత్తుల ద్వారా రెట్టింపు లాభాలు వస్తున్నా, లీటరు పాలకు రైతులకు చెల్లించే ధర మాత్రం కేవలం 35 రూపాయలే. ఇతర దేశాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీలు ఇక్కడి రైతులకు మాత్రం పాలసేకరణ ధరలు పెంచడంలేదు. ప్రభుత్వాలు ఈ దిగుమతి దారులతో లాలూచీపడి ఇక్కడి పాల రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. పాడి పశువుల నిర్వహణ, దాణా ఖర్చుల వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు ఐదు లీటర్ల పాల ద్వారా రూ.150 ఆదాయం తెచ్చే గేదెకు దాణా, పశుగ్రాసం, వైద్యఖర్చుల కోసం సుమారు రూ.138 ఖర్చవుతుండగా రైతు శ్రమకు రూ.12లు మిగులుతుంది. ఈ ఖర్చులు పెరిగిన తరుణంలో ప్రస్తుతం చెల్లిస్తున్న పాల ధరలు పాడి రైతుల్ని నష్టాల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. 


ప్రభుత్వం పాడి రైతుల స్థితిగతులు మెరుగుపడేలా చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన పాలు తక్కువ ధరలో అందించాలంటే పాల ఉత్పత్తి పెంచేలా పశుపోషకులకు విరివిగా సబ్సిడీలు అందించాలి. దేశీయ పాలను, పాల పదార్ధాల ఉత్పత్తులను పెంచడంతోపాటు దేశీయ వినియోగాన్ని కూడా పెంచుకోవాలి. దిగుమతులను నిషేధించాలి, లేదా దిగుమతి సుంకాలను ఇక్కడి ఉత్పత్తి ఖర్చులకు సమానంగా పెంచి నియంత్రించాలి. రాష్ట్ర ప్రభుత్వం పాడిపశువుల కొనుగోలు పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబా నికి పాడి పశువులను పంపిణీ చేయాలి. తెలంగాణ ఉష్ణోగ్రతల్ని తట్టుకునే జాతులను ఎంపిక చేసుకునే అవకాశమివ్వాలి. రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని కొనసాగించాలి. ప్రతీ 15 రోజులకు ఒకసారి రైతులకు చెల్లించే పాల బిల్లుతోపాటు నగదు రూపంలో చెల్లించాలి. అధిక ఉత్పాదకత కోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల్లో పశువుల పెంపకం చేపట్టే విధంగా పాడి రైతులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించాలి. ఉపాధి లేని యువతను ఈ రంగం వైపు ప్రోత్సహించాలి. మౌలిక పశువైద్య వసతులు కల్పించాలి. కృత్రిమ గర్భధారణ సేవలను విస్తృతపరచాలి. పశు భీమా పథకాన్ని అమలు చేస్తూ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. మార్కెట్‌ ధరలకనుగుణంగా రైతులకు పాల ధరలు పెంచాలి. పశు దాణాను, కరువు పరిస్థితులను తట్టుకునే పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలి. ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల పాకలు, షెడ్లను ఏర్పాటు చేయాలి. మిల్క్‌ టెస్టర్లు, చాఫ్‌ కట్టర్‌లు, మిల్క్‌ అనలైజర్లు సరఫరా చేయాలి. పాడి రైతులకు వ్యక్తిగత భీమా సౌకర్యం ప్రభుత్వ ప్రీమియంతో కల్పించాలి. పాల సేకరణ ఎక్కువగా ప్రభుత్వ సహకార డెయిరీల ద్వారా జరిగే చర్యలు చేపట్టాలి.


ఉడుత రవీందర్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం

9490098487                          (29 Aug 2020 ఆంధ్రజ్యోతి లో ప్రచురించారు)



 

            కరోనా పేషంట్లకు పునర్జన్మనిస్తున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం'

         హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వికె) అనగానే రాష్ట్రంలో అందరికి గుర్తుకొచ్చేది అక్కడ జరిగే సభలు, సమావేశాలే. నిత్యం ఏవో కళా ప్రదర్శనలు, మహాసభలు, ఉద్యమ మీటింగ్‌లతో కళకళలాడుతుంది. 1987లో ఏర్పడినప్పటి నుంచి ఉద్యమాలకు కేంద్రంగా నిలుస్తూ, అభ్యుదయ భావజాలాన్ని విస్తృత పరుస్తుంది. లెఫ్టిస్టుల నుంచి రైటిస్టుల వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహించని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడా ఉద్యమ కేంద్రం హాస్పిటల్‌గా మారింది. అనేక మంది కరోనా బాధితులకు పునర్జన్మనిస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా విశ్వమానవాళిని భయాందోళనలకు గురిచేస్తూ, లక్షలాది చావులకు కారణమైన 'కరోనా వైరస్‌', తన లక్షణాలను మార్చుకుంటూ విజృంభిస్తుంది. పేషంట్లకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, సిబ్బంది లేరు, ఆక్సిజన్‌ లేదు, టీకాలు లేవు, మందులు కొరత కూడా ఉంది. వైరస్‌ను కట్టడి చేయాల్సిన పాలకులు ప్రజల ప్రాణాలను గాలికొదిలి, ఎన్నికలు, 'మేళా'లు నిర్వహించి మరీ వైరస్‌ను ఎగదోశారు. చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అంటూ ప్రజలను మూఢత్వంలో ముంచి ఇప్పుడు దొంగ ఏడుపులేడుస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడినవి. ప్రజలను చైతన్య పరుస్తూ, మెరుగైన సమాజం కోసం పాటుపడుతూ, ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంది. నేడు కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు నాయకులను, ఉద్యమకారులను, డాక్టర్లను, ప్రజా సేవకులను, ఎందరో జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంటుంది. ఈ తరుణంలో అన్ని పార్టీల ఎజెండా ప్రజలను రక్షించేదిగా ఉండాలి. కాని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చేతులు ముడుచుకు కూర్చున్నాయి. వీటికి భిన్నంగా కమ్యూనిస్టులు ప్రభుత్వాలను ప్రశ్నించడం, తగు సూచనలివ్వడమే కాకుండా ప్రజాసేవలో నిమగమయ్యారు. కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులన్నీ కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా, హెల్ప్‌లైన్‌ సెంటర్లుగా మార్చారు. ఆ పార్టీల కార్యకర్తలంతా తమ శక్తిమేర ప్రజలకు సహాయపడుతున్నారు. సీపీఐ(ఎం) హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఎస్‌వికెతోపాటు మరో 6 జిల్లాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజాసంఘాల రాష్ట్ర ఆఫీసులతోపాటు మిగతా చోట్ల హెల్ప్‌లైన్‌ సెంటర్లు నడుపుతున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వమే ఉపయోగించు కోవాలని మొదట సీపీఐ(ఎం) సూచించింది. సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మే 3న తామే 25 బెడ్లతో ఉచిత ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి, ఇప్పుడు 50 బెడ్లకు పెంచారు. ఈ కేంద్రానికి వచ్చిన పేషంట్లకు ప్రతిరోజు సాయంత్రం ఒక డాక్టర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ, మూడుసార్లు మరో ముగ్గురు వైద్యులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. సుశిక్షుతులైన వైద్య సిబ్బంది రోజుకి నాలుగుసార్లు ఆక్సిజన్‌ లెవల్స్‌, పల్స్‌ రేట్‌, బీపీ చెక్‌ చేస్తూ డాక్టర్ల సూచన మేరకు సరైన మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్‌ కూడా అందించడానికి 9 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చారు. సమయానికి పౌష్టికాహారం అందిస్తున్నారు. పేషంట్ల మానసిక ఉల్లాసానికి భారీ స్క్రీన్‌పై వినోద కార్యక్రమాలతోపాటు, సైకాలజీ డాక్టర్ల మోటివేషన్‌ వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కి తీసిపోని విధంగా వార్డును రోజుకు నాలుగుసార్లు శుభ్రం చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగా పడిపోయి, వెంటిలేటర్‌ అత్యవసరమైతే వెంటనే అంబులెన్సులో గాంధీ, కింగ్‌ కోఠి, టిమ్స్‌, ఫివర్‌ హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందేలా ప్రయత్నిస్తున్నారు. ఈ సెంటర్‌ నిర్వహణకు దాతలు సహకరించాలని కోరగానే వివిధ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు వస్తు, నగదు రూపాల్లో తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కొందరు దాతలు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, అంబులెన్సు లేవని తెలుసుకొని వాటిని ఉచితంగా అందించారు. మొదట్లో భయపడిన స్థానిక బస్తీవాసులు, సుందరయ్య పార్కు వాకర్స్‌ కూడా ఇప్పుడు భాగస్వాములై సహకరిస్తున్నారు. బియ్యం, ఉప్పులు-పప్పులు, కూరగాయలు, పండ్లు, మెడిసిన్స్‌, పీపీఈ కిట్లు, మాస్కులు మొదలగు వాటిని అందిస్తూ చేతనైనంత మేరకు సహకరిస్తున్నారు. ఇక ఈ సెంటర్‌ నిర్వహణను సీపీఐ(ఎం) రాష్ట్ర నేతల్లో ఒకరు 24 గంటలు అక్కడే ఉండి పర్యవేక్షిస్తుండగా మరో ఇద్దరు నాయకులు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ సహకరిస్తున్నారు. రాష్ట్ర కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకులు, ఎస్‌వికె సిబ్బందితోపాటు సిటీ క్యాడర్‌ మొత్తం 30 మంది ప్రతిరోజు వాలంటీర్లుగా తమ సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు 114 మంది పేషంట్లు ఈ ఐసోలేషన్‌ కేంద్రానికి రాగా, అందులో 72 మంది పూర్తి ఆరోగ్యవంతులుగా ఇండ్లకు వెళ్లారు. 13 మందిని మెరుగైన వైద్యంకోసం వివిధ హాస్పిటల్స్‌కు తరలించగా, మిగతా వారు ఇక్కడే సేవలు పొందుతున్నారు. ఇందులో, నగరంలోని దోమలగూడకు చెందిన 65ఏండ్ల వద్దురాలికి, ఆమె కొడుకుకి కరోనా సోకిందని తెలియడంతో ఇంటి ఓనర్లు గెంటేయగా ఒక రోజంతా రోడ్డుపై గడిపారు. తర్వాత ఎస్‌వికె ఐసోలేషన్‌ సెంటర్‌లో ఆశ్రయంపొంది, చికిత్స తీసుకొని 16 రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన భార్యాభర్తలిద్దరు 14 రోజులు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళుతూ ''మేం పేదోళ్లం, లక్షలు పెట్టి ప్రయివేట్‌ దవాఖానాల్లో సూపెట్టుకోలేనోళ్లం, గవర్నమెంటు ఆస్పత్రిలో బెడ్లు లేవు, బతుకుతమో లేదో అని భయపడ్డాం. 'మా అమ్మ జన్మనిస్తే, ఈ సెంటర్‌ మాకు పునర్జన్మనిచ్చింది' ఇప్పుడు ఆనందంగా ఇంటికి వెళ్తున్నాం'' అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కొందరు ఓ.యు. విద్యార్థి సంఘాల నాయకులు ఎస్‌వికె అంటే ఉద్యమ మీటింగులకే కాదు ప్రజల ఆరోగ్య కష్టాల్లో కూడా ముందుందని, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కంటే బెటరని, ఇక్కడి సర్వీస్‌ చాలా బాగుందని కొనియాడారు. మీర్‌పేట్‌కు చెందిన ఓ ప్రయివేట్‌ ఉద్యోగిని ''మా ఇంట్లో కంటే ఇక్కడే బాగా చూసుకున్నారు'' అని చెప్పి తనవంతుగా సెంటర్‌కు ఆర్థిక సహకారం చేసింది. సామాన్యుల నుంచి నాయకుల వరకు అనేకమంది ఎస్‌.వి.కె సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడల్లా కమ్యూనిస్టులు ప్రజాసేవలో ముందుంటారని చెప్పడానికి కరోనా తీవ్రతలో మరొకసారి ఉదాహరణగా నిలిచారు. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ప్రజలకు కష్టాల్లో మేమున్నామంటూ తమ సేవలందించడం అవసరమే కదా!! - ఉడుత రవీందర్‌                                                (09.06.2021 "నవతెలంగాణ" దినపత్రికలోప్రచురించారు)
సెల్‌:9490098487